మద్యం ప్రియులకు మరో షాక్..

Telangana Government Set To Hike Liquor Prices By Up To 20

తెలంగాణలో మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలనుంది. బీర్ల సరఫరా కంపెనీల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో లైట్, స్ట్రాంగ్ బీర్ల ధరలు అమాంతం పెరిగాయి. సుమారు రూ.20 నుంచి 30 మేర ధరలు పెరిగిన నేపథ్యంలో మందు బాబులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుంచి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల పెంచిన బీర్ల ధరల కారణంగా ఎక్సైజ్ శాఖకు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు సమాచారం.

పొరుగు రాష్ట్రాల్లో చీప్ లిక్కర్ ధరల నియంత్రణ ఉంది. అక్కడి ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ పన్నులను తగ్గించి తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. ఉదాహరణగా, కర్ణాటక ప్రభుత్వం 90 ఎంఎల్ టెట్రాప్యాక్ చీప్ లిక్కర్‌ను రూ.45కు అందిస్తుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం దేశీదారు పేరుతో క్వార్టర్ సీసాను రూ.35కే విక్రయిస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు క్వార్టర్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తోంది.

ఇప్పటికే బీరు ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ (ఐఎఫ్‌ఎమ్‌ఎల్‌) మద్యం రకాల ధరల పెంపునకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ధరల నిర్ణయ కమిటీ మద్యం ధరలను 15 శాతం నుంచి 20 శాతం మేర పెంచే అవకాశముందని నివేదిక అందించింది. ప్రస్తుతం 180 ఎంఎల్ ఉండే క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.110గా ఉంది. దీని ధర మరో రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది.

తెలంగాణలో పొరుగు రాష్ట్రాల మాదిరిగా చీప్ లిక్కర్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని సవరించి ధరలు తగ్గించాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి, విక్రయాలు, ఎన్డీపీఎల్ కేసులు తగ్గుతాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం, విదేశీ దిగుమతి మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ 15% నుంచి 20% వరకు ధరలు పెంచే సూచనలతో నివేదిక రూపొందించినట్టు సమాచారం. త్వరలోనే మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుందని తెలుస్తోంది.