తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక తీపి కబురు అందించారు. ఈ యేడాది యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రేపటినుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని, రాష్ట్రంపై కేంద్ర కుట్రలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. సీజన్‌లో ఎంత దిగుబడి వస్తే అంత మొత్తం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అలాగే రైతులెవరూ తక్కువ ధరకే తమ పంటను అమ్ముకోవద్దని.. క్వింటాల్ కు రూ.1960 చొప్పున చెల్లిస్తామని తెలిపారు. ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం పైకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని కూడా తెలిపారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను తీవ్ర అన్యాయం చేసిందని, ధాన్యం కొనడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానిస్తారా అని ప్రశ్నించారు. దేశ ఆహార భద్రత కేంద్రానిదేనని, దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి దేశాన్ని పరిపాలించటం చేతకావడం లేదని, రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తుంటే చూసి ఓర్వలేకపోతోందని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, కేంద్రమే రోజు రోజుకు ధరలు పెంచుతోందని మండిపడ్డారు. దేశమంతటికీ అన్నాన్ని అందించే రైతుల విషయంలో కూడా కేంద్ర దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, చివరకు ఎరువులపై ధరలు భారీగా పెంచారని విమర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ