తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరోసారి నీటి వివాదం ముదురుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ నిర్మించనున్న కొత్త ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. వాటిని అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి నదిపై నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులపై సంబంధిత నిబంధనలు, అనుమతులేకుండా ఏపీ unilateral నిర్ణయాలు తీసుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపడుతోంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌తో కలిసి ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల్లో ఈ అంశంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణ సర్కారు చెబుతున్న దానిప్రకారం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్టులు కేంద్ర జలవనరుల శాఖ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ మరియు అపెక్స్ కౌన్సిల్ వంటి అధికారం కలిగిన సంస్థల అనుమతి లేకుండానే చేపడుతున్నట్లు ఆరోపిస్తోంది. ఇదంతా 1980 జీడబ్ల్యూడీటీ ట్రైబ్యునల్, 2014 పునర్ వ్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని తెలిపింది. గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే రాయలసీమ ప్రాజెక్టుపై కేంద్రం స్పందించిందని, పర్యావరణ, అటవీ శాఖల నిపుణుల కమిటీ విచారణ చేపట్టిందని తెలిపారు. అయినా ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గకపోవడంతో తాము కోర్టును ఆశ్రయిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల భద్రాచలం ప్రాంతం ప్రమాదంలో పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమస్యలను సరిగా ఎదుర్కోలేదని విమర్శిస్తూ, ఇప్పుడు మాత్రం ఏపీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.