‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ముగింపు వేడుకలో జరిగిన భారీ డ్రోన్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ప్రదర్శనలో మొత్తం 3,000 డ్రోన్లు ఆకాశంలో అద్భుతంగా విహరిస్తూ ప్రత్యేక దృశ్యాలు ఆవిష్కరించాయి. హైవేకి ఆనుకుని ఉన్న బేగరికంచ, మీర్ఖాన్పేట గ్రామాల ప్రజలు తమ గ్రామాల నుంచే ఈ దృశ్యాలను ఆస్వాదించడం విశేషం.
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – జాయిన్ ది రైజ్’ అనే నినాదం, దాని మధ్యలో తెలంగాణ రాష్ట్ర పటంతో కూడిన అంకెల సమన్వయం ప్రపంచంలోనే పొడవైన గగనవాక్యంగా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. తద్వారా గతంలో అబుదాబీలో 2,131 డ్రోన్లతో నమోదు చేసిన రికార్డును అధిగమించడం విశేషం. గిన్నిస్ అధికారుల చేతుల మీదుగా రికార్డు ధృవపత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించారు.
వివిధ సంక్షేమ పథకాల ఆకృతులు
డ్రోన్ షో మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలు, రాష్ట్ర పురోగతి ప్రతిబింబించేలా రూపొందించిన విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. డ్రోన్ల వెలుగుల సందడి అనంతరం ఆకాశాన్ని ప్రకాశవంతం చేసిన బాణసంచా ప్రదర్శన కార్యక్రమ స్థలాన్ని పండుగ వాతావరణంతో ముంచెత్తింది.
ఇక సదస్సు ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అతిథులకు మరిచిపోలేని అనుభూతి ఇచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాల కళారూపాలు, సంగీత ప్రదర్శనలు, ఫోక్ డాన్స్లు సందర్శకులను అలరించాయి. మరోవైపు, సదస్సు ప్రాంగణానికి వచ్చే మార్గాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. మంగళవారం రోజంతా శ్రీశైలం హైవే వాహనాలతో రద్దీగా మారింది.
టెక్నాలజీ, సంస్కృతి, ఆవిష్కరణ — మూడు రంగాలను ఒకే వేదికపై ఏకం చేస్తూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతంగా ముగిసింది. ఈ భారీ ఈవెంట్ ద్వారా తెలంగాణను ప్రపంచ దృష్టిలో మరింత బలంగా నిలబెట్టడంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు.
సమిట్ ముగింపు వేడుక
-
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రానున్న 22 ఏళ్ల లక్ష్యాలను వివరించే ‘విజన్ 2047’ పత్రాన్ని ఆవిష్కరించిన వెంటనే డ్రోన్ షో జరిగింది. అంతకుముందు, ఒక రోబోట్ ఈ విజన్ డాక్యుమెంట్ను ముఖ్యమంత్రికి అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
-
ప్రముఖుల భాగస్వామ్యం: ఈ కార్యక్రమంలో మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, మాజీ కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, సినీ నటుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
-
అంతర్జాతీయ ప్రశంసలు: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి నమూనా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా మారిందని కొనియాడారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా పాల్గొని, ఈ విజన్ డాక్యుమెంట్ పాలనను మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా చేస్తుందని పేర్కొన్నారు.
- తెలంగాణ తన ఏర్పాటు నుంచి నేటి వరకు అసాధారణమైన ప్రగతిని సాధించిందని, ఇది ఐటీ, వ్యవసాయం, సమ్మిళిత వృద్ధి రంగాలలో శక్తి కేంద్రంగా రూపుదిద్దుకుందని టోనీ బ్లెయిర్ తెలిపారు.





































