‘క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌’ తెలంగాణ కొత్త ముఖచిత్రం – సీఎం రేవంత్ రెడ్డి విజన్

Telangana Rising Vision 2047 CM Revanth Reddy Unveils Plan For $3 Trillion Economy

‘క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌’ ఇదే తెలంగాణ కొత్త ముఖచిత్రం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును, సుదీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తూ ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ డాక్యుమెంట్‌పై నిన్న సమీక్ష నిర్వహించి, గ్లోబల్ సమిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

“ఆదాయాన్ని పెంచాలి.. పేదలకు పంచాలి” అనే ప్రధాన విధానంతో ముందుకు సాగుతున్నామని, తమ దార్శనికత ప్రకారం 2037 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, ఆపై 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఈ విజన్ డాక్యుమెంట్‌ను మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా విభజించారు. అవి: ‘CURE’, ‘PURE’, ‘RARE’. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ప్రాంతాన్ని CURE (Core Urban Region Economy)గా పరిగణిస్తారు. ఇక్కడ కాలుష్యాన్ని తగ్గించి, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రణాళికలతో హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా, సర్వీస్ సెక్టార్ హబ్‌గా అభివృద్ధి చేస్తారు.

ORR, రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతమైన PURE (Peri Urban Region Economy)ను ఒక బలమైన మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇక RRR ఆవల రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని RARE (Rural Agriculture Region Economy)గా అభివృద్ధి చేసి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులతో గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆర్థిక వృద్ధిలో భాగస్వాములను చేయనున్నారు.

ఈ విజన్ అమలులో భాగంగా, నాణ్యమైన విద్య, సాంకేతిక విద్యను అందించడానికి మరియు పౌష్టికాహార సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ విద్యా సంస్థలను ఆకర్షించి, తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా సృష్టించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తమ ప్రభుత్వం అభివృద్ధిలో చైనా, జపాన్, సింగపూర్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోందని, ఈ కారణంగానే పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడి పెట్టకపోతే ఏదో కోల్పోతున్నామని భావించేలా వాతావరణాన్ని కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దార్శనిక పత్రాన్ని డిసెంబర్ 6వ తేదీ నాటికి సంపూర్ణంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, డిసెంబర్ 1 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాపాలన ఉత్సవాల’ను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here