పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన మైలురాయిగా భావించబడతాయి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా వారు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. అందుకే టెన్త్ ఫలితాల విడుదల తేదీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
పరీక్షల సమాప్తం & మూల్యాంకన ప్రక్రియ
తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,650 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, మొత్తం పరీక్షల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
ఇప్పుడు విద్యార్థులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం ఫలితాల విడుదల తేదీ. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7 నుండి 15 వరకు 19 మూల్యాంకన శిబిరాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు 20 రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫలితాల విడుదల తేదీ & కొత్త మార్పులు
పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో లేదా మే నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ SSC బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి నేరుగా మార్కులను కేటాయించనుంది. ఎక్స్‌టర్నల్ పరీక్షలకు 80 మార్కులు, ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులు కేటాయించారు.
అంతేకాక, ఓరియెంటల్ సైన్స్‌కు సంబంధించి మిగిలిన రెండు పరీక్షలు ఏప్రిల్ 3, 4 తేదీల్లో జరుగుతాయని, వీటికి కొద్దిమంది విద్యార్థులే హాజరుకాబోతున్నారని అధికారులు పేర్కొన్నారు.