హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్..మళ్లీ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవర నుంచి ఏప్రిల్ మధ్య 26,027 ఇళ్లకు రిజిస్ట్రేషన్ జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది . గతేడాది మొదటి నాలుగు నెలలతో దీనిని పోలిస్తే ఇది 15 శాతం గ్రోత్‌కు సమానమయినట్లని చెబుతోంది. వీటి విలువ రూ.16,190 కోట్లు ఉండగా.. ఏడాది ప్రాతిపదికన 40 శాతం పెరిగినట్లు కన్సల్టెన్సీ కంపెనీ అంటోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరగడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం ఇళ్ల విలువ భారీ ఆదాయాన్ని రాబట్టిందని వెల్లడించింది.
ముఖ్యంగా రూ. కోటి కంటే ఎక్కువ విలువున్న ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చెబుతోంది. గతేడాది జనవరి-ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో రూ. కోటి కంటే ఎక్కువ విలువున్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 92 శాతం పెరిగాయి. రూ.50 లక్షల నుంచి రూ. కోటి మధ్య ఉండే ఇండ్ల రిజిస్ట్రేషన్లు 47 శాతం పెరిగాయి. మొత్తంగా అన్ని సెగ్మెంట్లలోని ఇండ్ల విలువ పెరిగిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
ఈ సంవత్సరం ఏప్రిల్ నెలను పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ.4వేల260 కోట్ల విలువైన 6వేల578 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరిగినట్లు తేలింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 46 శాతం పెరగగా, వీటి విలువ ఏకంగా 86 శాతం వృద్ధి చెందిందనట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కిందకు వస్తాయి.
మొత్తంగా ఎక్కువ విలువున్న ఇళ్లపై కొనుగోలుదారుల ఆసక్తి పెరిగినట్లు చెప్పిన నైట్ ఫ్రాంక్ .. రూ.50 లక్షల కంటే తక్కువ విలువున్న ఇళ్లకు డిమాండ్ తగ్గుతోందని చెప్పింది. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రూ.50 లక్షల ధర ఉన్న ఇళ్లు రిజిస్ట్రేషన్స్ 4 శాతం తగ్గిపోయాయి. అయితే రూ. కోటి కంటే ఎక్కువ విలువ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్ 92 శాతం వరకూ పెరిగిపోయాయి.
దేశంలోని ఇతర సిటీల్లోలాగే హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో కూడా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోన్నట్లు తేలింది. ఎక్కువ స్పేస్, ఎక్కువ సౌకర్యాలున్న ఇళ్ల వైపు చాలామంది చూస్తున్నారని నైట్ ఫ్రాంక్ చెప్పింది. కరోనా సంక్షోభం తర్వాత నుంచి ఇళ్ల రేట్లు నిలకడగా పెరుగుతున్నట్లు గమనించామని..ఈ ట్రెండ్ కిందటి నెలలో కూడా కనిపించిందని తెలిపింది.
హైదరాబాద్‌లో మార్చి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇళ్లలో వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ల వాటా 70 శాతంగా ఉంది. చిన్న ఇళ్లకు అంటే వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండే ఇళ్లకు డిమాండ్ పడిపోతోంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ వాటా 16 శాతానికి తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ గుర్తించింది. జిల్లాల వారీగా చూస్తే మార్చి నెలలో రంగారెడ్డి నుంచి ఎక్కువ ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
మొత్తం ఇళ్లలో రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా వాటా 45 శాతంగా ఉంది. మేడ్చల్, మల్కాజ్‌గిరి వాటా 39 శాతంగా ఉండగా.. హైదరాబాద్ వాటా 16 శాతంగా ఉంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీల ధరలు మాత్రం ఏప్రిల్‌లో 17 శాతం పెరిగాయి. రంగారెడ్డి, మేడ్చల్,మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 18% వృద్ధి చెందాయి. హైదరాబాద్, సంగారెడ్డిలో మాత్రం 7 శాతం వరకు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది.