దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ ఊరు చూసినా, ఏ వాడ చూసినా గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తున్నారు. విద్యుత్ కాంతుల శోభతో గణేష్ మండపాలు ప్రత్యేక కళను సంతరించుకున్నాయి.
కాగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల గణపతులను టీవీలలోనూ, సోషల్ మీడియాలలోనూ చూస్తూభక్తులు మైమరిపోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో కాణిపాకం వినాయకుడి నుంచి స్వయంభుసిద్ధి వినాయకులు కొలువుండే ఆలయాల గురించి చర్చ నడుస్తోంది. అలా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం గురించి తాజాగా చర్చ జరుగుతోంది.
అత్యంత పురాతన ఏకశిలతో చేసిన గణపతి దేశంలోనే పెద్దదిగా పేరుంది. ఈ గణేషుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా.. విగ్రహం వెడల్పు 15 అడుగులు ఉంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ చెబుతున్న దాని ప్రకారం .. సుమారు 879 ఏళ్ల కిందట అంటే క్రీస్తుశకం 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు.
వినాయచవితి ఉత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామ శివారుల్లో ఉన్న ఈ గణపతి విగ్రహాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మరోవైపు కళ్యాణ చాళుక్యుల కాలంలోనే క్రీస్తు శకం 11 శతాబ్దంలో చెక్కిన మరొక విగ్రహం కూడా తెలంగాణలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇది సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి గ్రామంలో ఉంది. ఆనాటి పాలకులు, హిందూ మతానికి, శిల్ప సౌందర్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఈ రెండు గణేశుని శిల్పాల్లో కనపడుతుందని భక్తులు మురిసిపోతుంటారు.