హైదరాబాద్‌లోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే నుమాయిష్. ఈ ఎగ్జిబిషన్ వచ్చిందంటే.. హైదరాబాద్ వాసులే కాదు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రజలకు నచ్చిన, అరుదైన వస్తువులు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన కళాఖండాలు..ఇంకా చెప్పాలంటే కర్చిఫ్ నుంచి ఫర్నిచర్ వరకూ అన్నీ కూడా నుమాయిష్‌లో కొలువుదీరుతాయి.
ఎన్నో పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల స్టాళ్లు, ఫుడ్ కోర్టులు, సందర్శకులను ఆకట్టుకోవడానికి అమ్యూజ్‌మెంట్ పార్క్ వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలు ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రతి ఏడాది ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1న ప్రారంభించి.. 46 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 15 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. కానీ, ఈ సంవత్సరం నుమాయిష్ ప్రారంభం వాయిదా పడింది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అంటే నుమాయిష్ బుధవారం జనవరి 1ను ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల ఆలస్యంగా అంటే, జనవరి 3వ తేదీనుంచీ ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3కు ఇది వాయిదా వేసింది. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమై ఎప్పటిలాగే ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ జరుగనుంది.
84వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ, నుమాయిష్‌కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా సుమారు 2500 స్టాళ్ల నిర్మాణానికి.. నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం.. స్టాళ్ల కేటాయించడం ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.