తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం పూర్తవగా.. పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా.. రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే.. అధికారులు కార్యాచరణ షురూ చేశారు. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించనున్నారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
కాగా, కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇటివల మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు మంత్రి పొన్నం పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణపై అధికారులతో చర్చించారు. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ ఓటరు లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాల తయారీ, ప్రచురణ కోసం.. షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
క్రితం సారి అంటే 2019లో తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో జనవరి 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత అప్పటి బీఆరఎస్ ప్రభుత్వం కొత్తగా మరో 224 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇవన్నీ కలిపి ప్రస్థుతం 12,993 గ్రామ పంచాయతీలు అయ్యాయి. వీటి ఎన్నికల కోసం కులగణన అంశం కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణను ముఖ్యంగా బీసీకుల గణను చేపడతామని హామీ ఇచ్చింది. రెండు రోజుల కిందటే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కుల గణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది.