టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కార్యాచరణను రూపొందించామని చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో, 142 మున్సిపాలిటీలు/కార్పొరేషన్స్ లో టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తామని చెప్పారు. జెండా పండుగలో భాగంగా ఆ రోజున గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. అదే రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని, అందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం ఉంటుందని, అలాగే సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపల మండల కార్యవర్గాలు, పట్టణ కార్యవర్గాలు నియమించాల్సి ఉంటుందన్నారు. వీటి తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు లేదా రాష్ట్ర స్థాయి బాధ్యులతో చర్చించి జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం ఎంపిక నిర్వహిస్తామన్నారు. అలాగే సెప్టెంబర్ 20 తర్వాత కొత్తగా రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. మొత్తం కమిటీలన్నీ సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తవుతాయని తెలిపారు.
ఇక హైదరాబాద్ లో ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకుపోతున్నామని చెప్పారు. హైదరాబాద్ లో బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక పార్టీ యొక్క నియామవళి ప్రకారం ఏ కమిటీలో అయినా సభ్యులుగా ఉండాలంటే క్రియాశీల సభ్యులే ఉండాల్సి ఉంటుందని, దాంతో పాటు ఏ కమిటీ అయినా చెల్లుబాటు కావాలంటే 51 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. పార్టీకి అనుబంధ సంఘాల అధ్యక్షులను, సోషల్ మీడియాకు సంబంధించి కూడా కమిటీలు వేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2న ప్రతి గ్రామంలో, వార్డులో జెండా ఎగురవేయాలని, ఇప్పటినుంచే నాయకులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ