తెలంగాణలో రేపు (ఆదివారం, జూన్ 11, 2023) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కాగా గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో.. ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో కీలక సమీక్షలు నిర్వహించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుండగా.. పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లను, చీఫ్ కో-ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్లను నియమించింది.
అలాగే పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. కాగా మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్ టీఎస్‌పీఎస్సీ జారీచేయగా.. అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి వరకు 2,85,000 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కొన్ని కీలక సూచనలు చేసింది. పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి..
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన కొన్ని కీలక సూచనలు..
- పరీక్ష జూన్ 11 ఆదివారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించబడుతుంది.
- ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్‌ను మూసివేస్తామని తెలిపింది.
- ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
- అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
- ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు పొరపాట్లు జరిగితే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది.
- ఇక అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే సమాధానాలను బబుల్ చేయాలని సూచించింది.
- పెన్సిల్, ఇంక్ పెన్ లేదా జెల్ పెన్‌తో బబ్లింగ్ చేస్తే, ఆ ఓఎంఆర్ షీట్‌లు చెల్లవని స్పష్టం చేసింది.
- డబుల్ బబ్లింగ్ కూడా అనుమతించేది లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చి చెప్పింది.
- ఒకవేళ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది.
- వారిని భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే మరే ఇతర పరీక్షలు రాయకుండా డిబార్ కూడా చేస్తామని హెచ్చరించింది.
- అభ్యర్థులు బూట్లు ధరించి పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్ స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE