కుల ఆధారిత జనాభా లెక్కల గురించి జరుగుతున్న చర్చలో తమిళనాడు వెట్రి కజగం నాయకుడి ప్రకటన కీలక పరిణామంగా భావిస్తున్నారు. వివిధ పార్టీలు కుల ఆధారిత జనాభా లెక్కలను డిమాండ్ చేస్తుండటంతో, రాబోయే రోజుల్లో ఈ అంశం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. కుల ఆధారిత జనాభా లెక్కల ఆవశ్యకతపై విజయ్ చెప్పడం హాట్‌టాపిక్‌గా మారింది.
దేశవ్యాప్తంగా కుల గణన జరగాలంటూ డిమాండ్ పెరుగుతోంది. కాగా దీనిపై తమిళనాడు వెట్రి కజగం నాయకుడు, సినీ నటుడు విజయ్ కులాల వారీగా జనాభా లెక్కల అవసరమని కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది. తమిళనాడులో కూడా ఇటీవల కుల ఆధారిత జనాభా లెక్కల గురించి పెరుగుతున్న చర్చల సందర్భంగా విజయ్ కీలక ప్రకటన చేశారు. సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో కులగణన నివేదిక ప్రాముఖ్యతను ప్రస్తావించిన విజయ్.. వివిధ పార్టీలు కచ్చితమైన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి ఈ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
సామాజిక న్యాయం కోసం పోరాటంలో కీలక పాత్ర వహించిన నాయకుడు పెరియార్ గురించి ప్రస్తుత పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించిన విజయ్.. అదే సమయంలో కులాల వారీగా జనాభా లెక్కలు నిర్వహించే అధికారం వారికి లేదన్నారు. రాజ్యాంగ సవరణకు దారితీసిన పోరాటంలో పెరియార్ నాయకత్వం వహించిన విషయాన్ని, రిజర్వేషన్ల అంశంపై భారతదేశానికి మార్గనిర్దేశం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.
బీహార్, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే కులాల వారీగా జనాభా గణనలు నిర్వహించాయని తమిళనాడు టీవీకే నేత విజయ్ తెలిపారు. తమిళనాడులో దానిని అనుసరించడానికి ఎందుకు వెనుకాడుతోందని విజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం యాభై రోజుల్లోనే కులాల వారీగా జనాభా గణనను పూర్తి చేసి, సర్వే నివేదికను చర్చించడానికి ప్రత్యేకంగా శాసనసభ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిందని విజయ్ చెప్పుకొచ్చారు. విజయ్ చేసిన కామెంట్లతో తమిళనాడు రాజకీయాలలో హీటు పెరిగింది. దీంతో మరింతగా కులగణన సర్వేపై డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.