బీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్‌లు..

Unexpected Shocks to BRS, Shocks to BRS, BRS Unexpected Shocks, BRS, KTR, KCR, Harish Rao, Telangana, Lok Sabha Elections, Latest BRS News, BRS Loss Interesting Facts, Telangana, TS CM Revanth Reddy, Mango News, Mango News Telugu
BRS, KTR, KCR, Harish Rao, Telangana, Lok sabha elections

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి చ‌విచూసిన భార‌తీయ రాష్ట్ర స‌మితికి ఊహించ‌ని చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. ఓట‌మికి 170 కార‌ణాలు ఉన్నాయంటూ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ స్వ‌యానా ప్ర‌క‌టించిన నాటి నుంచీ.. నేత‌లు సైతం గ‌ళం విప్పుతున్నారు. స‌భ్యుల‌ను మార్చ‌క‌పోవ‌డం వ‌ల్లే ఓడిపోయామ‌ని ఓ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలో పేర్కొన్న కేటీఆర్ కు.. అదేం కాదు.. పార్టీ ప‌రంగా ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డ‌మే ఓట‌మికి కార‌ణ‌మ‌ని సీనియ‌ర్ నేత‌లు కేటీఆర్ ముందే చెప్పారు. తాజాగా జ‌రిగిన పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల స‌మావేశంలోనూ ప‌లువురు అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. హ‌మ్మ‌య్య‌.. ఇన్నాళ్ల‌కు మిమ్మ‌ల్ని క‌లుసుకునే అవ‌కాశం వ‌చ్చింది.. ఓడిపోతే కానీ.. పార్టీ కార్య‌క‌ర్తల‌ను, నేత‌ల‌ను క‌ల‌వ‌రు.. అన్న మాట అని ఓ నేత నేరుగా కేటీఆర్ ముందు అన్న‌ట్లుగా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. చాలాచోట్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పార్టీ ఖాతాలో ఉన్న ప‌లు మునిపాలిటీలు, కార్పొరేష‌న్ లు చేజారిపోతున్నాయి. ఇప్పటికే 29 మునిసిపాలిటీల్లో అసమ్మతి వర్గం అవిశ్వాస నోటీసులు అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని మునిసిపాలిటీల్లో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెజారిటీ కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడేళ్లుగా అభివృద్ధి పనుల్లో తమను భాగస్వాములను చేయలేదని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అసమ్మతితో రగిలిపోతున్నారు. బెల్లంపల్లిలో 18 మంది కౌన్సిలర్లు ఇప్ప‌టికే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషయ్యకు పదవీ గండం ఎదురైంది. మంచిర్యాల మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గేశారు.

లోక‌ల్ లొల్లి అలా ఉండ‌గా.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పీఎల్‌ శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయ‌డం మ‌రో పెద్ద షాక్‌. ఆయ‌న రాజీనామా చేస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల పట్ల నాయకత్వ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పార్టీని వీడేందుకు 100 కారణాలు ఉన్నాయని, భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఆదరించరని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం అటు ప్రజలను కానీ, ఇటు పార్టీ కార్యకర్తలను కానీ కలవడానికి నిరాకరించిన నేతలు ఇప్పుడు తామే వారి వద్దకు వెళ్తామంటున్నారు. తప్పదు. ఎవరి కోసం వెళ్తారు ? అధికారం పోతే కానీ దిగి రావ‌డం లేద‌ని స‌మీక్షా స‌మావేశాల్లోనే ప‌లువురు గ‌ళం ఎత్తుతున్నారు.

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్న బీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు ‘‘ఇప్పటిదాకా మిమ్మల్ని పట్టించుకోలేదు. నిజమే. ఇప్పుడిక పట్టించుకుంటాం. మీవెంటే ఉంటాం’’ అని  ప్రకటిస్తుండటం పార్టీనేతలకు లోలోపల సంతోషం కలిగిస్తోంది.పైకి చెప్పనప్పటికీ, బాగా అయింది. ఓడిపోకుండా మళ్లీ గెలిస్తే మమ్మల్నసలు చూసేవాళ్లా? అని అనుకుంటున్న వాళ్లూ తక్కువేం లేరు. అంతేకాదు కేసీఆర్‌ అధికారంలో ఉండటం కంటే ప్రతిపక్షంలో ఉంటేనే కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రమాదం అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పేరు చెప్పడానికి ఇష్టపడని ఓనేత.. అయితే ఎల్లకాలం అలా ఉంటేనే బెటర్‌.అలా అయితేనే ప్రజలకు కూడా మేలు జరుగుతుందని అన్నారంటే బీఆర్‌ఎస్‌ తీరుపై కార్యకర్తలే కాదు నేతలు సైతం ఎంతగా విసిగిపోయారో అంచనా వేసుకోవచ్చు.

ఇదే సందర్భంగా ఎంతసేపూ కాంగ్రెస్‌  ఎక్కువకాలం ఉండదు. తొందరలోనే కూలిపోతుంది. మనకిది స్పీడ్‌బ్రేకర్‌ మాత్రమే అంటున్న నేతల తీరునూ కొంద‌రు బీఆర్‌ఎస్‌ శ్రేణులు తప్పు పడుతున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి సత్తా చాటుదాం అనడం వరకు బాగానే ఉంది కానీ.. కాంగ్రెస్‌ ఉండదు అని వీళ్లు పెడుతున్న శాపనార్థాలే వాళ్లకు దీవెనలుగా మారతాయని అంటున్న వారు కూడా ఉన్నారంటే.. కనీసం దిగువశ్రేణి నేతలు కార్యకర్తలకున్నపాటి హుందాతనం కూడా అగ్రనేతలకు లోపించిందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE