సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..బిజెపి , బిఆర్ఎస్ నేతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది జస్ట్ ట్రైలర్..అసలు సినిమా చూపిస్తాం అంటూ హెచ్చరించారు.
ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయని, ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. మూసి ప్రక్షాళన అడ్డుకుంటే నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లు తీసుకెళ్లకపోతే నేను పేరు మార్చుకుంటానని రేవంత్ హెచ్చరించారు. బుల్డోజర్లకు అడ్డుపడతామని మాట్లాడుతున్న బిల్లా రంగాలు.. ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి.. మా వెంకన్నను బుల్డోజర్ పై ఎక్కిస్తా… మా ఎమ్మెల్యే సామెల్ తో జెండా ఊపిస్తానని సవాల్ చేశారు.
మూసీ ప్రక్షాళన విషయంలో తాము మద్ధతిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు… బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా? అని ప్రశ్నించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మూసీ నదిలో చేపట్టాల్సిన పనులపై కొన్ని సలహాలు, సూచనలు చేశారు. నగరానికి ప్రధానమైన నీటి వనరుగా ఉన్న సమయంలో నిజాం రాజులు.. మూసీ కాల్వ వెంట రిటైనింగ్ వాల్ కట్టారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించాలని సూచించారు. మూసీ నదిని శుభ్రమైన నీటితో ప్రవహించేలా చేస్తామంటున్న ప్రభుత్వం.. కేవలం సుందరీకరణ కోసమే మూసీ ప్రక్షాళన అంటే తాము అంగీకరించమని ప్రకటించారు.
మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆస్తుల కంటే అప్పులు ఎక్కువున్నాయని చెబుతున్న ప్రభుత్వం.. ఇంత భారీ మొత్తంలో నిధుల్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుంది అని అడిగారు.