రాములమ్మగా పేరుగాంచిన మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి రాజకీయంగా సక్రియమవుతున్నారు. కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ పరిస్థితిపై చర్చించి, తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం యాక్టివ్‌గా పని చేయాలని ఖర్గే సూచించినట్లు సమాచారం. అయితే, విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు దక్కుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ
ఈ నెల 10న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఐదు స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కి దక్కనున్నాయి. ఓ సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించనున్నారు. మరో స్థానానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎంకు కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌కు మిగిలిన మూడు స్థానాల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.
విజయశాంతికి అవకాశం ఉందా?
ఒసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అయితే, బీసీ, ఎస్సీ, మైనారిటీ అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తారని మరో వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి ఎమ్మెల్సీ కోటాలో మహిళా రిజర్వేషన్ కింద తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీకి శక్తి మేర సహకరిస్తానని ఖర్గేకి స్పష్టం చేశారు. ఖర్గే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రేవంత్ అభిప్రాయం, పార్టీ కొత్త ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనలు ఈ ఎంపికలో కీలకంగా మారనున్నాయి. విజయశాంతికి ఈ విడత ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందా, లేక మరొక దఫా పరిశీలిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.