త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో క్రమంగా పుంజుకుంటూ వస్తున్న బీజేపీ.. 8 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్లో 8 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తోంది.అయితే, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు మాత్రం పార్టీ కేడర్ లోనూ వినిపిస్తున్నాయి.
ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి చేజిక్కించుకున్న కాంగ్రెస్.. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొంతమంది సీనియర్ నాయకులను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో తమ పార్టీలోకి లాక్కుంటోంది. కానీ, బీజేపీలో చూద్దామన్నా ఇలాంటి సీన్ కనిపించడం లేదు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటివరకు కమలం గూటికి చేరింది లేదు. భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరుతారా.. అనేది కూడా అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఉంది. దీంతో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా.. లేనట్టా? అనే ప్రశ్నలు పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి.
నిజానికి ఏ పార్టీలో లేనివిధంగా కేవలం చేరికల కోసమే ప్రత్యేకంగా కమిటీ వేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీజేపీనే. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ కమిటీని ప్రకటించిన అధిష్టానం.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఈ బాధ్యతలను అప్పగించింది. అయితే, అప్పుడు పార్టీలో కొంతమంది చేరినా.. ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ దక్కలేదనే చెప్పొచ్చు. కమిటీ ఏర్పాటుపై సొంత పార్టీ నేతల నుంచి మొదటి నుంచి పెద్దగా స్పందన లేదు. అసలు ఇతర పార్టీలోని నేతలను చేర్చుకోవడానికి కూడా ఒక కమిటీ అవసరమా అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో రోజురోజుకు పార్టీలో బలాన్ని పెంచుకుంటూ దూసుకుపోతుంటే కమలం పార్టీలో మాత్రం ఎలాంటి జాయినింగ్స్ లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సమానంగా సీట్లు సాధించిన కాషాయ పార్టీలో ఒక్కరు కూడా చేరకపోవడంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేయగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికోసం బీజేపీ కింది స్థాయిలో కేడర్‌ను పెంచుకోవాల్సి ఉంది. కానీ, దానికి అనుగుణంగా పార్టీలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే గ్రౌండ్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆదేశించినా ఇప్పటికి ఎన్ని కమిటీలు పూర్తయ్యాయనేది తెలియదు. అయితే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..26 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని.. అయితే వారిని రాజీనామా చేయమని కోరడంతో బీజేపీలోకి రాలేదని చెప్పుకొచ్చారు. మరి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీ ఎలా ముందుకు వెళుతుందో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE