ఇటీవల కర్ణాటక-ఆంధ్ర జీవనాడి అయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. గేటు కొట్టుకుపోవడంతో భారీ ఎత్తున నీరు వృథాగా పోయి డ్యాం ఖాళీ అయింది.
ఆ పరిసరాల్లోని వేల ఎకరాల్లోని పంట నీట మునిగిపోయి రైతులకు అపార నష్టాన్ని కలిగించింది. అయితే ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని డ్యామ్ ల భద్రతపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఏళ్ల క్రితం కట్టిన డ్యామ్‌లన్నీ భద్రంగానే ఉన్నాయా..? లేక ఇప్పుడు వాటి వల్ల ప్రమాదాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల డ్యామ్ భద్రతపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడి చాలా గేట్లకు లీకేజీలు ఏర్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
మరోవైపు జూరాల ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ నిపుణులు చాలా ఏళ్లుగా చెబుతూ వస్తున్నారు. దీంతో 2021లో ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించడంతో మరమ్మతులు జరిగాయి. అయితే సాంకేతిక సమస్యలు, నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వంటి కారణాలలో జూరాల డ్యామ్ మొత్తం 62 గేట్లలో ఐదింటికి మాత్రమే అప్పుడు మరమ్మతులు జరిగాయి.
అప్పుడు మిగతా గేట్లు బాగానే ఉన్నాయంటూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మిగతా వాటి పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉందని.. ఏ క్షణమైనా ముప్పు పొంచి ఉందని అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.