టీ కేబినెట్: అసలు విషయం ఆ తర్వాతే..!

Cm revanth reddy, Telangana cabinet, Congress government, Telangana
Cm revanth reddy, Telangana cabinet, Congress government, Telangana

తెలుగురాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌లు.. ప్ర‌ధానంగా రెండు అంశాల చుట్టూ తిరుగాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే, తెలంగాణ‌లో రుణ‌మాఫీపై తీవ్ర‌మైన  స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌లు ఆయా అంశాల‌పై వాదోప‌వాదాలు చేసుకున్నారు. స‌వాళ్లు – ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. ఏపీ సంగ‌తి అటుంచితే.. తెలంగాణ‌లో రుణ‌మాఫీపై పెద్ద ఫైటే జ‌రిగింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి..  కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట త‌ప్పిందంటూ.. బీఆర్ ఎస్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించింది. ఆగ‌స్టు 15లోగా.. రెండు ల‌క్ష‌ల రుణమాఫీ ఏక‌కాలంలో చేసి తీరుతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో చాలాసార్లు ప్ర‌క‌టించారు. దీనికి స్పందించిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు.. అలా చేస్తే తాను రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.

అంతేకాదు.. రాజీనామా లేఖ‌తో అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద‌కు వ‌చ్చి హ‌డావిడి చేశారు. దీనికి రేవంత్ కూడా కౌంటర్ ఇచ్చారు. హ‌రీశ్‌రావు రాజీనామా లేఖ‌ను రెడీ చేసి పెట్టుకోవాల‌ని ప్ర‌తిస‌వాల్ విసిరారు. కేబినెట్ భేటీలో చ‌ర్చించి.. వ‌డివ‌డిగా ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ స‌ర్కారు భావించింది. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అడ్డురావ‌డంతో దాని గురించి చ‌ర్చ‌లేకుండానే కేబినెట్ భేటీ కొన‌సాగిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. భేటీ అనంత‌రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని స్ప‌ష్టం చేశారు. ‘‘ ధాన్యం కొనుగోలు అన్ని చోట్లా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ చేసినవి అన్నీ డ్రామాలు. పదేళ్లు మీరు రైతుల కోసం ఏం చేశారో తెలుసు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతాం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గత పదేళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. కేబినెట్ భేటీకి సంబంధించిన చాలా అంశాలను జూన్ 5 న తెలియజేస్తాం. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తాం’’ అని వెల్ల‌డించారు.

సోమ‌వారం జ‌రిగిన కేబినెట్ భేటీ నాలుగు గంట‌ల పాటు సాగినా.. ఎన్నికల సంఘం షరతుల మేరకు కొన్ని అంశాల‌పైనే చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియా గాంధీని తెలంగాణకు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లపై రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. రేపటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని మంత్రులు తెలిపారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.  అలాగే.. విద్యారంగ అభివృద్ధికి కూడా కేబినెట్ లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాలంటే జూన్ 5వ‌ర‌కూ ఆగాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY