తెలంగాణలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. విజయ్ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హైస్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందినదిగా తెలుస్తోంది. భారీ శబ్దాలతో పార్టీ జరుగుతోందని సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అక్కడ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు డ్రగ్స్ వాడినట్టు అనుమానం వచ్చింది. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వారిలో విజయ్ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దాదాపు 30 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు.. రాజ్ పాకాలపై అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. 10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్ కార్డ్స్, పోకర్, క్యాసినో వంటి వాటిని గుర్తించారు. ఫాంహౌస్‌లో దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
కాగా ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్‌లోనే రేవ్ పార్టీల నిర్వహణా? అని మండిపడ్డారు. డ్రగ్స్ తీసుకొని దొరికినా కేటీఆర్ బుకాయిస్తాడేమోనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక్కడి సీసీ ఫుటేజీ, ఆధారాలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఈ కేసులో సుద్దపూసను కావాలనే తప్పించారనే ప్రచారం సాగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అందరిపైనా చర్యలు తీసుకొని చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం నిరూపించాలని కోరారు. యువతను భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ విషయంలో రాజీ ధోరణి వద్దని కేంద్రమంత్రి సూచించారు.