
తెలంగాణలో అన్ని నియోజకవర్గాల కంటే భువనగిరి నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా లేదని..ఇప్పుడు వార్ అంతా కాంగ్రెస్, బీజేపీ మధ్యేనన్న వాదన వినిపిస్తోంది. అయితే మొన్నటివరకూ ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌లో పోలింగ్ లెక్కలు కాస్త టెన్షన్ పెడుతున్నాయట. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 75 వేల ఓట్లు కూడా దాటని బీజేపీ.. రెండున్నర లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ ఉన్న తమకు ఇంత గట్టి పోటీ ఇవ్వటం ఏంటా అని కాంగ్రెస్ నేతలు ఆరా తీస్తున్నారట.
ఈ ఎన్నికలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేడర్‌ను ఉత్సాహపరిచారు.అయితే భువనగిరిలో మొదటి నుంచీ గెలవాలని అనుకుంటున్న బీజేపీ కూడా అమిత్ షా, జేపీ నడ్డాలను రంగంలోకి దించి ప్రచారాన్ని హోరెత్తించింది. దీంతోనే ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగానే సాగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మూడోసారి కూడా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బూర నర్సయ్య గౌడ్.. ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలిచి, రెండోసారి కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు నెలలకు ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బూర నర్సయ్య గౌడ్ .. మూడు సార్లు బరిలోకి దిగిన అనుభవం, బీసీ కార్డు, మోడీ చరీష్మా, బీజేపీ హవా… అర్బన్ ఓటింగ్ అన్నీ తనకు కలిసి వస్తాయని..కచ్చితంగా భువనగిరి కోటపై కాషాయం జెండా ఎగరడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల బాధ్యతలు తీసుకోవడం వల్లే కాంగ్రెస్ ఈ స్థాయిలో ప్రభావం చూపగలిగిందన్న నమ్మకంతో కోమటిరెడ్డి అనుచరులు ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి రాజగోపాల్ రెడ్డి సీరియస్ ప్రయత్నించారని అంటున్నారు. మొత్తంగా భువనగిరి ఎన్నికల ఫలితాలు ఈ ఇద్దరి అభ్యర్ధులకు కీలకంగా మారడంతో.. ఇక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతుందా అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY