కులాల వారీగా లెక్కలు.. సమీకరణాలు రాజకీయాలకే కాదు.. సంక్షేమ పథకాల అమలుకూ అవసరమే. అయితే.. ఎన్నికల సమయంలోనే కులాల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు.. కుల గణనకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. రాష్ట్రంలో త్వరలో కుల గణన చేపడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఏపీ ప్రభుత్వం కులగణనను హడావిడిగా ప్రారంభించింది. త్వరలో ఏపీ అసెంబ్లీతో పాటు ఇరు రాష్ట్రాలలోనూ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కులగణనను నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పలువురు మేధావులు కోరుతున్నారు. కులగణన ద్వారా అధికార పార్టీకి లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నారు.
కానీ.. ఏపీలో కులగణన ఇప్పటికే నాలుగింట మూడొంతలకు పైగా పూర్తయిందని తెలుస్తోంది. సచివాలయ సిబ్బంది కొద్ది రోజులుగా పనులకే ఎక్కవ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వేగంగా లెక్కలు తేల్చుతున్నారు. అంతకు ముందే సచివాలయ వ్యవస్థ వలంటీర్ల ద్వారా కుటుంబాలు, వ్యక్తుల సంఖ్యను సేకరించింది. దాని ప్రకారం.. మొత్తం 1.67 కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ఉన్నట్లు తెలిసింది. అనంతరం కులగణనపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ సుమారు నాలుగు కోట్ల మంది.. అంటే 80 శాతం కులగణన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయం సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా తాజాగా కులాలవారీ లెక్క తీసేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇందుకు ఎదురయ్యే ఇబ్బందులు, తలెత్తే సమస్యలు సహా అన్ని వివరాలను బడ్జెట్ సమావేశాల్లోపు అందజేయాలని నిర్దేశించినట్లు సమాచారం. వాస్తవానికి దేశవ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల వారీగా ఎన్ని కులాలు ఉన్నాయి.. వాటి ఉప కులాలు ఎన్ని.. వాటిలో ఉన్న మొత్తం జనాభా ఎంత.. అనే దానిపై ఇప్పటికీ స్పష్టమైన గణాంకాలేవీ లేవు. జనాభా లెక్కల ఆధారంగా తేల్చిన కులాల గణాంకాలు మాత్రమే ఒక అంచనాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బీసీల సంఖ్య తేల్చడమే లక్ష్యంగా కుల గణనకు బిహార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
బిహార్ లో కులగణనకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు కుల గణనకు ముందుకొచ్చాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే కుల గణన జరుపుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించింది. కర్ణాటకలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభమవ్వగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కుల గణనకు పచ్చజెండా ఊపింది. కులాలు.. వాటిలో ఉప కులాలు.. మొత్తం జనాభా తదితర వివరాలను ఈ ప్రక్రియలో నమోదు చేస్తారు. నిజానికి, కుల గణనకు ఇప్పటికీ 1931 గణాంకాలపైనే ఆధారపడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వరకూ నాటి లెక్కలే ఆధారం. అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంగా ఉండగా.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు ఎంతమంది ఉన్నారనే దానిని తేల్చారు. ఆయా గణాంకాల ప్రకారం కూడా బీసీలే అధికంగా ఉన్నారని తేలింది. 1931 తర్వాత మళ్లీ ఇప్పుడే కులగణనపై అడుగులు ముందుకు పడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం 2014 ఆగస్టు 19న ‘సమగ్ర కుటుంబ సర్వే’ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో రాష్ట్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు, జనాభా లెక్కలను పూర్తిస్థాయిలో తేల్చారు. కానీ, కులాల విషయంలో స్పష్టత రాలేదు. ఇందుకు కారణం.. కులాల స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అనే వివరాలను మాత్రమే నమోదు చేయడమే. ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10, ఓసీలు 21 శాతం ఉండగా, బీసీలు 51 శాతం ఉన్నట్టు అందులో గుర్తించారు. అసలు సర్వే వివరాలను కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించలేదు.
అయితే.. ఈ కులాల గణనతో ఎవరికి ఉపయోగం అనే ప్రశ్నలూ ఉత్పన్నం అవుతున్నాయి. దేశంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో తేల్చడం ద్వారా.. పేదల సంఖ్యను బట్టి కాకుండా, కులాలను బట్టి పాలన, పథకాల ప్రకటనలు ఉంటాయని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న కులగణనలో కొందరు ఇవే ప్రశ్నలు వేస్తున్నారు కూడా. కుల గణనతో అన్ని కులాల్లోనూ ఉప కులాలు, వాటి జనభాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. తద్వారా, రిజర్వేషన్లతోపాటు ఆయా కులాల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏపీ కులగణనలో నో క్యాస్ట్ ఆప్షన్ కూడా అందులో ఉండడంతో ఇంకొందరు లౌకికవాదులు దాన్ని ఎంచుకుంటున్నారు. తెలంగాణలో కూడా కులగణను మొదలైతే.. అందులోనూ ఈ ఆప్షన్ ఉంటుందా, లేదా చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE