తెలంగాణ రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకోస్తామంటూ తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. కొన్ని నెలల క్రితం వరకు రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కానీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒంటరిగా కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.దీంతోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు వైఎస్ షర్మిల దంపతులు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం జరుగుతుండగా..షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సుదీర్ఘ భేటీ తర్వాత హైదరాబాద్ చేరుకున్న షర్మిల…మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. తాను ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే.. తెలంగాణ ప్రజల కోసమే నా తాపత్రయం అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. విలీనంపై త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. రాహుల్, సోనియా తనతో ఆప్యాయంగా మాట్లాడారంటూ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందించిందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని బట్టి.. విలీనంపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం చేయాలని తెలంగాణ రాష్ట్ర నేతలు సూచిస్తున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన ఆమె తెలంగాణ రాజకీయాల్లోకి వస్తే పార్టీకి పెద్దగా కలిసివచ్చేది ఏమీలేదని అంటున్నారు. అందుకే షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఇంకా పూర్తి హామీ ఇవ్వలేదని.. అందుకే షర్మిల కూడా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం వార్తలు వస్తుండటంతో.. షర్మిల పార్టీకి పలువురు నేతలు, పార్టీ అధికార ప్రతినిధులు రాజీనామాలు చేశారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీని విలీనం చేయాలన్న షర్మిల ఆలోచనను పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. అయితే, షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై కచ్చితమైన ప్రకటన మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. మరోవైపు, పాలేరు నుంచి షర్మిల పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకోగా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల పాలేరు స్థానాన్ని త్యాగం చేయాల్సి రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE