తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చింది. టీపీసీసీ సారథిగా ఉండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆ పదవి ఎవరికనే చర్చ మొదలైంది. అయితే.., అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటేనే లోక్‌సభ ఎన్నికలు రావడం, రేవంత్ సారథ్యంలోనే అవి కూడా పూర్తి చేయాలని అధిష్ఠానం భావించడంతో ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో కొత్త టీపీసీసీ సారథి ఎవరనే చర్చ నడుస్తోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంతో టీపీసీసీకి రాజీనామా చేయడం తప్పనిసరి. ఈక్రమంలో ఆ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు లైనులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఇంతకు ముందే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో అప్పటినుంచే చాలా మంది ఖర్చీప్ వేసుకుని కూర్చున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అధ్యక్షుడి పోస్టుకు మరింత డిమాండ్ పెరిగింది. కొందరు కుల సమీకరనాలు బేరీజు వేసుకుని మరీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అయితే పీసీసీ అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని భావిస్తే భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డ భట్టి అదనంగా పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సీటు ఆశించిన సంపత్ పేరు కూడా టీపీసీసీ రేసులో ఉంది. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మధు యాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మహేష్, అంజన్ కు రేవంత్ మద్దతు ఉంటుంది. రేవంత్ ప్రతిపాదించిన వారికి అవకాశం ఉంటుందని భావిస్తున్న పలువురు నేతలు.. ఆయన ద్వారా మంత్రాంగం నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు వినపడుతోంది. అయితే ఇప్పటికే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క కు అవకాశం ఉంది. సీతక్కపై రేవంత్ కు సదాభిప్రాయం ఉంది. ఆమె సామర్థ్యంపై నమ్మకం ఉంది. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తామని రేవంతే ఓ సందర్భంలో వెల్లడించారు. ఈక్రమంలో ఆమెకు కూడా అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY