ఎగ్జిట్ పోల్స్ అనంతరం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అనుకున్నది ఒకటి.. జరగబోయేది మరొకటా.. అనే సందిగ్దం అధికార పార్టీలో కాంగ్రెస్ లో కనిపిస్తోంది. లక్ష్యానికి చేరువ అవుతామనే ధీమా కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. ఒకడేమో ఒకటి అంటున్నాడు.. మరొకడేమో మూడు అంటున్నారు.. ఇంకొకడేమో 11 అంటున్నాడు.. ఎగ్జిట్ పోల్స్ పెద్ద గ్యాంబ్లింగ్.. అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొంటున్నారు. 11 వచ్చినా.. పొంగుపోము.. మూడొచ్చినా కుంగిపోమని అంటున్నారు. ఈక్రమంలో రేపు వెల్లడికాబోయే ఫలితాలపై ఉత్కంఠ ఏర్పడింది.
ఎగ్జిట్ పోల్స్ ను బట్టి ఒకటి మాత్రం స్పష్టం అవుతోంది. తెలంగాణ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ తో పాటు బీజేపీని కూడా ఆదరించినట్లుగా మెజార్టీ సంస్థల ఫలితాలను బట్టి తెలుస్తోంది. శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థల అంచనా ప్రకారం.. కాంగ్రెస్, బీజేపీ సమాన సీట్లను సాధించనున్నాయి. మరికొన్ని సంస్థలు అయితే.. కాంగ్రెస్ కంటే బీజేపీయే పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆరా సర్వే సంస్థ, ఏబీపీ-సీ ఓటర్, పీపుల్స్ పల్స్ సంస్థలు రెండు పార్టీలు దాదాపు సమాన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధించనున్న స్థానాల్లో వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, నాగర్ కర్నూలు, భువనగిరి ఉన్నాయని అనేక సంస్థలు పేర్కొన్నాయి.
కాంగ్రెస్ గెలుపొందనున్న అన్ని స్థానాల్లోనూ బీజేపీ రెండో స్థానంలో, బీఆర్‌ఎస్ మూడో స్థానంలో ఉండనున్నాయి. ఇండియా టుడే, న్యూస్-18, జన్ కీ బాత్, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సంస్థలు మాత్రం బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని విశ్లేషించాయి. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది. వీటిలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. వీటిని నిలబెట్టుకోవడంతోపాటు చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్ స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. అన్ని సంస్థల కంటే భిన్నంగా బీజేపీ 11-12 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే – మై యాక్సిస్ సంస్థ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 43 శాతం ఓట్లను సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ 7-10 స్థానాలను కైవసం చేసుకుంటుందని సీఎన్‌ఎన్ సంస్థ తెలిపింది.
ఇక రాష్ట్రం కోసం పుట్టిన టీఆర్ ఎస్ (బీఆర్‌ఎస్)కైతే ఈ ఎన్నికల్లోనూ చేదు అనుభవమే అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి భంగపాటు తప్పదని మెజార్టీ సంస్థలు తెలిపాయి. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ ఓటమి పాలవ్వనుందని దాదాపు అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 9 స్థానాలు సాధించిన గులాబీ పార్టీ.. ఈసారి అన్నిచోట్ల మూడో స్థానానికి పరిమితం కానుందని వివరించాయి. ఒక్క సీఎన్‌ఎన్ మాత్రమే బీఆర్‌ఎస్ 2-5 స్థానాలు సాధించే అవకాశముందని పేర్కొంది. ఈక్రమంలో ఎవరి అంచనాలు కరెక్టో.. ఎవరి అంచనాలు తప్పాయో.. రేపు మధ్యాహ్నానికే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE