తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయి. భూప్రకంపనలు మళ్లీ వస్తే పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా జరుగుతోంది. ఓ భారీ భూకంపం వచ్చాక అక్కడే మళ్లీ వస్తే.. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రకంపనలు వస్తూనే ఉంటాయని పలు సమయాల్లో రుజువైంది. దీంతో మన దగ్గర మళ్లీ భూప్రకంపనలు వస్తాయా..? భూకంపాల విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎంత వరకు సేఫ్? ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్‌లో ఉన్నాయి? హైదరాబాద్, విశాఖ , విజయవాడ నగరాలు సేఫ్‌గా ఉంటాయా?అనేది చర్చనీయాంశంగా మారింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5 దాటి రావడం ….అందులోనూ.. భూకంపాలు అతితక్కువగా వచ్చే తెలంగాణలో ఈస్థాయిలో రావడం అంటే.. కచ్చితంగా చర్చించాల్సిందే. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపం 5.3గా రికార్డ్ అయింది. ఈస్థాయి భూకంపం వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇక భద్రాచలం దగ్గర 1969లో వచ్చిన భూకంపం 5.7గా రికార్డ్ అయింది.
ములుగు అనేది గోదావరి పరీవాహక ప్రాంతం. పైగా మరోవైపు బొగ్గు గనులు ఉండే ప్రాంతం కూడా. ఈ బొగ్గుగనుల్లో ఓపెన్ కాస్ట్‌లే కాదు.. భూగర్భ గనులు కూడా ఉంటాయి. 24 గంటల పాటు బొగ్గు ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అంటే.. భూమిలోపలి ఖనిజాన్ని ఖాళీ చేస్తున్నట్టే లెక్క. దీనివల్ల భూమిలోపలి పొరలు మరింత పలుచబడతాయి. తెలంగాణలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉన్నది మాత్రం గోదావరి నదికి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లోనే అనేది శాస్త్రవేత్తలు చెప్పే మాట.
హైదరాబాద్, వైజాగ్, విజయవాడ.. ఇలాంటి నగరాలకు భూకంపం ముప్పు ఉందా? వస్తే ఏ స్థాయిలో భూకంపం వస్తుంది..? అనేది చూస్తే….. హైదరాబాద్ జోన్-2 పరిధిలో ఉంది. అంటే.. రిక్టర్ స్కేలుపై 1 నుంచి 4 స్థాయిలో భూకంపం రావొచ్చు. జియోలజిస్టులు దీన్నే.. అతితక్కువ స్థాయి భూకంపాల జోన్ అంటుంటారు. సో.. 1 నుంచి 4 స్థాయిలో వచ్చినా హైదరాబాదీలకు పెద్దగా తెలీదు. అంటే స్వల్పస్థాయిలోనేనని అర్థమౌతుంది.
ఇక విశాఖ కూడా జోన్-2లోనే ఉంది. అంటే.. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో విశాఖలోనూ అలాగే ఉంటుంది. భూకంపాలు వచ్చినా వచ్చినట్టు తెలీదంతే. కాకపోతే.. సముద్రగర్భంలో భారీ భూకంపం పుడితే మాత్రం.. సునామీ విరుచుకుపడొచ్చు. అదొక్క ప్రమాదం అయితే ఉంది. ఇక హైదరాబాద్, విశాఖ కంటే విజయవాడ కాస్త డేంజర్ జోన్‌లో ఉంది. ఇది జోన్-3లో ఉంది. అంటే తక్కువ స్థాయి భూకంపాలు వస్తాయన్న మాట. ఈ జోన్‌లో విజయవాడతో పాటు మచిలీపట్నం, నెల్లూరు ఏరియాలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో జోన్-3లో ఉన్న ప్రాంతాలన్నీ గోదావరి నదీతీరంలో ఉన్నాయి. ఇక జోన్-4 ఏరియాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. బొగ్గు గనులు ఉన్నటువంటి కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి వంటి ప్రాంతాలు.. కాస్త డేంజర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాంతాల్లో భూకంప తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చు అంటున్నారు సైంటిస్టులు.