టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు

టీటీడీ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చినా ఏ ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని దర్శనానికి వచ్చే భక్తులకు అడుగడుగునా సౌకర్యాలు కల్పించడం వెనుక టీటీడీ బోర్డు ఉండటం వల్లే ఇది సాధ్యం అన్న విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎలాంటి అపశృతి లేకుండా ఇన్నేళ్లు భక్తులకు విశేష సేవలందించడంలో టీటీడీ బోర్డు ఐకమత్యం, కృషి ఉండనే ఉంటాయి.

ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టలో కూడా ఇలాంటి బోర్డును ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదగిరి గుట్టలో టీటీడీ బోర్డు తరహాలో వైటీడీ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్టను మరింతగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో వివరించారు.

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి( వైటీబీ బోర్డు)ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. 18 మంది సభ్యులతో కొత్తగా వైటీడీ బోర్డు ఉంటుందని..ఈ బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని కొండా సురేఖ అన్నారు. ఐఏఎస్‌ అధికారి వైటీడీ ఈవోగా ఉంటారని.. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవని.. ఈ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించిందని మంత్రి గుర్తు చేశారు.

యాదగిరి గుట్ట ఆలయాన్ని ఇంకా మెరుగు పరచడానికి యాదగిరిగుట్ట పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సమర్థమైన పాలక మండలిని నియమించి.. యాదగిరిగుట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే ఏడాదికి 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయాలన్నీ దేవదాయశాఖ పరిధిలోకి వస్తాయని ఆమె క్లారిటీ ఇచ్చారు వైటీడీ బోర్డు బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుందని.. పాలకమండలి ఆధ్వర్యంలో, యాదగిరిగుట్టలో విద్యాసంస్థలను, ఆధ్యాత్మిక పాఠశాలలను కూడా నెలకొల్పి నిర్వహించొచ్చని మంత్రి చెప్పుకొచ్చారు.