ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తెనాలి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల.. మధ్యలో ప్రయాణికులతో ముచ్చటించారు. వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. షర్మిల తమ బస్సు ఎక్కడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపటి తర్వాత ఆమెకు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
విజయవాడ-తెనాలి బస్సు ఎక్కిన వైఎస్ షర్మిల మధ్యలో మహిళా ప్రయాణికుల పక్కనే కూర్చుని వారితో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కాకపోవడంపై వారు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. హామీ అమలు కోసం వారు ఎదురుచూస్తున్నట్లు ఆమెకు చెప్పారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం హామీ కోసం గట్టిగా అడగాలని షర్మిల మహిళా ప్రయాణికులకు సూచించారు. మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. హామీలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లు వేశారని కూటమి నేతలు మర్చిపోతున్నారని వైఎస్ షర్మిల అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైపోయిందని, ఇప్పటివరకూ ఉచిత బస్సు పథకం అమలు చేయలేదని విమర్శించారు షర్మిల. తాను ప్రయాణిస్తున్న బస్సులో ఉన్న మహిళలు చంద్రబాబు ఉచిత బస్సు ఏమైందని అడుగుతున్నారని తెలిపారు. తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు అమలు చేశారని, కానీ ఏపీలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 20 లక్షల మంది మహిళలే ఉన్నారని, దీంతో నెలకు 300 కోట్లు ఖర్చవుతుందన్నారు. మహిళలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని అడిగారు.
ఇప్పటికే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా పాలసీల పేరుతో టైంపాస్ చేస్తున్నారంటూ షర్మిల నిన్న ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఇవాళ నేరుగా మహిళా ప్రయాణికుల వద్దకే వెళ్లి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకూ షర్మిల పోరాటం కొనసాగించేందుకు సిద్దమైనట్లు అర్థమవుతోంది.