మొదటి నుంచీ అంతా అనుకున్నట్లుగానే నిఖిల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. అయితే కొద్ది మంది మాత్రం నిఖిల్ టైటిల్ విన్నర్ అవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తెలుగు సీజన్లో కన్నడ వ్యక్తి టైటిల్ కొట్టడం ఏంటి ఇందులో ఏదో జరిగిందంటూ హడావుడి చేశారు. మామూలుగా అయితే విన్నర్ ను ప్రకటించగా గత సీజన్లో లాగే బయట రచ్చ రచ్చ జరిగేది .
కానీ ఈసారి తెలంగాణ పోలీసుల పకడ్బందీ ప్రణాళిక విజయవంతమయింది. అందువల్లే ఈసారి ఎటువంటి గొడవలు జరగకుండా.. ప్రశాంత వాతావరణం చోటుచేసుకుంది. బిగ్ బాస్ -8 సీజన్ లో విజేత ప్రకటన.. ఆ తర్వాత పరిణామాలు సాఫీగా సాగిపోయాయి.
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1న ఆదివారం ప్రారంభమై.. డిసెంబర్ 15న ఆదివారంతో ముగిసింది. 105 రోజులపాటు సాగిన షోలో.. కర్ణాటకకు చెందిన సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. 55 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు.
బిగ్ బాస్ -8 సీజన్ లో మొత్తం 22 మంది పోటీలో పాల్గొనగా..వీరిలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఈ సీజన్లో ఫైనల్లో గౌతమ్, నిఖిల్, నబిల్, అవినాష్, ప్రేరణ మాత్రమే మిగిలారు. నిఖిల్, గౌతమ్ ఫైనల్ లో ట్రోఫీ కోసం చివరి వరకూ పోటీపడగా..చివరికి నిఖిల్ విజేతగా నిలిచాడు. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతి సుజుకి కారు గెలుచుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఏడో సీజన్లో విజేతగా నిలిచాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన వివాదాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. అప్పుడు వేలాది మందితో ర్యాలీ నిర్వహించడంతో హైదరాబాదీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు ఈ సీన్ ప్రహసనంగా మారింది. చివరకు ట్రోఫీ అందుకున్న కొద్దిసేపటికే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసే వరకూ వెళ్లింది.
ఇప్పుడు కూడా అదే సీన్ జరుగుతుందని ఆలోచించిన హైదరాబాద్ పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకంగా 300 మంది పోలీసులు రంగంలోకి దిగి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద భారీగా వ్యవహరించారు. అన్నపూర్ణ స్టూడియో వెళ్లే దారులను మూసివేశారు. ఊరేగింపునకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులు చెప్పినట్టుగానే నిఖిల్ సైలెంట్ గా తన ఇంటికి తను వెళ్లిపోవడంతో బిగ్ బాస్ 8 సీజన్ ప్రశాంతంగానే ముగిసినట్లు అయింది.