ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జనగణనకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనాభా లెక్కల కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ సోమవారం దేశవ్యాప్త జనగణన (Census) షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించిన సందర్భంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలిదశ జనగణన ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
ఈ తొలిదశలో ప్రధానంగా గృహ గణన, కుటుంబాల గుర్తింపు మరియు వారి జీవన స్థితిగతులపై సమాచారాన్ని సేకరిస్తారు. రెండవ దశను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు, ఆ సమయంలోనే వ్యక్తుల కులం, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక వివరాలను సేకరించి, 2027 మార్చి 1న తుది గణాంకాలను ప్రకటిస్తారు.
మృత్యుంజయ కుమార్ నారాయణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఆన్లైన్ నమోదు, మే 1 నుంచి మే 30 వరకు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. అటు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునే (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం కల్పించారు.
అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు నెల రోజుల పాటు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో పౌరులు తమ వివరాలను వెల్లడించేందుకు ఎటువంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని, చెప్పిన వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారని స్పష్టం చేశారు.
తొలిదశ జనగణన – ముఖ్యాంశాలు:
-
డిజిటల్ విధానం: ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. ఎన్యూమరేటర్లు మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేస్తారు.
-
33 ప్రశ్నలు: తొలిదశలో నివాస గృహం, వాహనాలు, ఆహారపు అలవాట్లు వంటి 33 రకాల అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
-
ఆన్లైన్ నమోదు (Self Enumeration): ప్రజలు స్వయంగా పోర్టల్లో వివరాలు నింపుకోవచ్చు. దీనివల్ల ఎన్యూమరేటర్ల భారం తగ్గుతుంది. పోర్టల్ తెలుగు సహా 16 భాషల్లో అందుబాటులో ఉంటుంది.
-
గోప్యత: సేకరించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది. దీనిని ఆర్టీఐ (RTI) కింద కూడా వెల్లడించరు, కోర్టులో సాక్ష్యంగా అంగీకరించరు.
-
భారీ యంత్రాంగం: దేశవ్యాప్తంగా 31 లక్షల మంది ఎన్యూమరేటర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు.
ప్రజలు చేయాల్సినవి ఇవే..!
-
కుటుంబ ఐడీ: కుటుంబ పెద్ద పేరు మీద ఒక ఐడీ జనరేట్ అవుతుంది. ఆన్లైన్లో నమోదు చేసిన వారు ఆ ఐడీని ఎన్యూమరేటర్లకు చూపిస్తే సరిపోతుంది.
-
సహజీవనం చేసేవారు: ఒక ఇంట్లో సహజీవనం చేసే వారు తమను భార్యాభర్తలుగా గుర్తించాలని కోరితే, ఎటువంటి ఆధారాలు అడగకుండానే వారిని దంపతులుగా నమోదు చేస్తారు.
-
మార్పులు చేర్పులు: ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయలేరు, కానీ ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు మార్పులు చేయమని కోరవచ్చు.
-
వేర్వేరు దశలు: 2027లో జరిగే రెండో దశలో మాత్రమే కుల గణన, జనాభా లెక్కలు మరియు సామాజిక-ఆర్థిక వివరాలు సేకరిస్తారు.
రాజకీయ విమర్శలు – జైరాం రమేశ్ ఆరోపణలు:
జనగణన షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జనాభా లెక్కల వివరాలు 2027లోనే వస్తాయని కమిషనర్ చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం 2029 వరకు రావని అబద్ధాలు ఆడుతోందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను త్వరగా ఆమోదించుకోవడానికే ప్రభుత్వం ఇలాంటి సాకులు చూపుతోందని ఆయన ఆరోపించారు.





































