నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్ గాంధీలకు మూడు వారాల గడువు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

National Herald Case Delhi HC Allows 3 Weeks For Sonia and Rahul Gandhi To Respond on ED Plea

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమాధానం దాఖలు చేయడానికి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సోనియా, రాహుల్‌తో పాటు సామ్ పిట్రోడా, సుమన్ దూబే, యంగ్ ఇండియన్ ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చి, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది.

దిగువ కోర్టు తీర్పును సవాలు చేసిన ఈడీ

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ (FIR) లేకుండా ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ నమోదు చేసిన ఛార్జ్‌షీట్‌ను స్వీకరించడానికి రావుస్ అవెన్యూ ట్రయల్ కోర్టు నిరాకరించింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీస్ లేదా దర్యాప్తు సంస్థ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ లేకుండా మనీలాండరింగ్ కేసు ముందుకు సాగదని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. అయితే, ట్రయల్ కోర్టు నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వదని, ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా న్యాయస్థానం తీసుకున్న చర్య ఎఫ్‌ఐఆర్ కంటే బలమైనదని వాదిస్తూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈడీ తరఫున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

2012 నాటి కేసు నేపథ్యం

2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ వివాదం ప్రారంభమైంది. నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కి చెందిన దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈడీ విచారణ చేపట్టి ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, దిగువ కోర్టు దాన్ని తిరస్కరించడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు పరిధిలో విచారణలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here