ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష, మెరిట్ జాబితా మూడు ఏళ్ళు చెల్లుబాటు

Cabinet Approves Setting up of National Recruitment Agency to Conduct Common Eligibility Test

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆగస్టు 19, బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి “నేషనల్ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)” ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటుగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి సైతం ఎన్‌ఆర్‌ఏ ఒకే ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తుందని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేషనల్ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) యొక్క మెరిట్ జాబితా మూడు సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ గడువులోగా అభ్యర్థుల మెరిట్ ను బట్టి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దేశంలో ప్రస్తుతం 20 కిపైగా రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు ఉండగా, వాటిల్లో యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబిపీఎస్ వంటి సంస్థలే ప్రస్తుతం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లు నిర్వహిస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుతో దేశంలో ఉన్న 20 పైగా ఉన్న రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు అన్ని ఒక గొడుగు కిందకు రానున్నాయి.

ఉద్యోగాల కల్పనకు ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు గొప్ప సంస్కరణగా నిలిచిపోనుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కూడా కేంద్ర కేబినెట్‌ ఈ రోజు ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu