కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ గురువారం నాడు మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆగస్టు నెలలో రెండు విడతలుగా ఈ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. ఆగస్టు 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు కృష్ణా, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో, ఆగస్టు 26 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు మిగతా 9 జిల్లాల్లో ఈ సర్వే జరిగిందని చెప్పారు. ఈ సర్వేలో భాగంగా రెండో విడతలో ప్రతి జిల్లాలో ఐదు వేల మంది శాంపిల్స్ ను టెస్ట్ చేశామని, ఎలాంటి లక్షణాలు లేని వారిపై కూడా ఈ సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒక రౌండ్ సీరో సర్వే పూర్తయ్యిందన్నారు.
రాష్ట్రంలో చాలామందికి కరోనా వైరస్ సోకినా లక్షణాలు లేవని, వైరస్ ప్రభావం ఉన్నట్టుగా తెలియకుండానే వారు సురక్షితంగా బయటపడ్డట్టు ఈ సర్వేలో తేలిందన్నారు. రాష్ట్రంలో సగటున 19.7 శాతం మందికి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్లు తెలుస్తుందని, వీరిలో యాంటీబాడీస్ వృద్ధి చెందాయన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో 22.5 శాతం, కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం, హై రిస్క్ పాపులేషన్ జోన్లలో 20.5 శాతం, నాన్ కంటైన్మెంట్ జోన్లలో19.3 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 18.2 శాతం మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినట్లుగా తెలుస్తుందని చెప్పారు. సర్వే నివేదిక ద్వారా వైరస్ ప్రభావాన్ని అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. త్వరలో కర్నూల్, విజయనగరం, చిత్తూరు, విశాఖలో జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినట్టు ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu