జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 5 లక్షల పరిహారంకు సీఎం జగన్ హామీ

5 Lakh Compensation for Journalists who Died with Corona, CM Jagan Guaranteed

కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ముందుండి సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటుగా కరోనా పరిస్థితుల్లో ప్రజలకు అవగాహనా పెంచుతూ జర్నలిస్టులు కీలక సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈ విభాగాలకు చెందిన పలువురు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో భాగంగా కరోనా బారినపడి మరణించిన జర్నలిస్ట్‌ లకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి మంగళవారం నాడు మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా కే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేశంలో కరోనా వలన ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు మరణించారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జర్నలిస్ట్ లను కరోనా వారియర్స్ గా పేర్కొన్నారని చెప్పారు. జర్నలిస్టులకు ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఇప్పటికే 38 మంది జర్నలిస్టులు మరణించారని, వారిని ఆదుకోమని కోరుతూ ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. చనిపోయిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు రూ. 5 లక్షలు పరిహారం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న జర్నలిస్టులకు కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్ కు, సహకరించిన ఇతరులకు కే శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu