వరదసాయం విషయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు? : మంత్రి కేటిఆర్

TRS Working President KTR Addresses Media over Flood Relief Activities

హైదరాబాద్ నగరంలో వరద సహాయక చర్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆదివారం నాడు తెలంగాణ భవన్ లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే.తారకరామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీవర్షాలు, వరదలతో ప్రజలు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు వారికీ అండగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే వరద సాయం అందరికీ అందించామని, ఎవరైనా అర్హులు మిగిలుంటే వారి ఇంటికే వెళ్లి సాయం చేస్తామని చెప్పారు. నగరంలో 1908లో మూసీకి వరదలు పోటెత్తాయి, అలాగే 1916 తర్వాత మళ్ళీ ఈ ఏడాదే భారీ వర్షాలు కురిశాయి, హైదరాబాద్‌ చరిత్రలోనే అతిపెద్ద వర్షపాతం ఈ ఏడాది నమోదైందని మంత్రి పేర్కొన్నారు. చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్లే వందలాది కాలనీలు నీటమునిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడంతో, చాలావరకు ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగామన్నారు. ఇలాంటి వైపరీత్యాలను ఎదుర్కొవడానికి నగరంలో ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు మంత్రి కేటిఆర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 800 మందితో డీఆర్‌ఎఫ్‌ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

4.30 లక్షలకు పైగా కుటుంబాలకు వరదసాయం:

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత సీఎం కేసీఆర్‌కు నివేదించడంతో తక్షణసాయం కింద సీఎం కేసీఆర్‌ రూ.550 కోట్లు కేటాయించి, బాధితులకు రూ.10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. మొత్తం 4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరదసాయం అందించినట్లు తెలిపారు. దసరా పండుగ లోపే వరద సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు వరదసాయం అందిన బాధితుల వివరాలను సేకరించాం. 920 బృందాలను ఏర్పాటు చేసి, వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించినట్లు తెలిపారు. ముందుగా ఒక్కరోజులోనే లక్ష మందికి వరద సాయాన్ని పంపిణీ చేశామని చెప్పారు. తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు బురద రాజకీయం చేశాయని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నరని, పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు చేయించారని మంత్రి విమర్శించారు.

వరద బాధితులకోసం అవసరమైతే మరో రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధం:

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మనసున్న ప్రభుత్వమని మంత్రి కేటిఆర్ అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైతే మరో రూ.100 కోట్లు కేటాయించేందుకు సిద్ధమని తెలిపారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సూచించారు.

వరదసాయం విషయంలో తెలంగాణపై వివక్ష ఎందుకు?:

ఈ సందర్భంగా వరదలతో నష్టానికి గురైన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించడంపై మంత్రి స్పందిస్తూ, కర్ణాటక, గుజరాత్‌పై ఉన్న ప్రేమ ప్రధానికి తెలంగాణపై ఎందుకు లేదని ప్రశ్నించారు. బెంగళూరు నగరానికి మూడు రోజుల్లో సహాయం ప్రకటించిన ప్రధాని మోదీ, హైదరాబాద్‌ కు జరిగిన నష్టం విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదని అన్నారు. వరద నష్టంపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాసినా ఫలితం లేదన్నారు. గుజరాత్‌లో వరదలు వచ్చిన సమయంలో స్వయంగా పర్యటించి నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ హైదరాబాద్‌ విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రాన్ని తక్షణ సాయంగా రూ.1350 కోట్లు అడిగితే నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు.బీజేపీ నుంచి కేంద్ర సహాయమంత్రి, ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ కూడా మొన్నటిదాక దుబ్బాకలో మునిగితేలిందని, అయినా అక్కడ వారికీ డిపాజిట్‌ కూడా రాదని అన్నారు. ఇప్పుడు ఇక్కడకొచ్చి వరద సాయంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కేటిఆర్ విమర్శించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ