తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన, షెడ్యూల్ ఇదే…

Pawan Kalyan Cyclone Affected Districts Tour Schedule Released

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుపాన్ మూలంగా పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటన మొదలుకానుంది. 2 వ తేదీ ఉదయం 9:30 గంటలకు పవన్ కళ్యాణ్ ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడి రైతులను కలిసి వారి బాధలను తెలుసుకొంటారు. అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుతారు. భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటిస్తారు.

ఇక 3వ తేదీన పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న నష్టాలపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముందుగా ఆదివారం నాడు నివర్ ప్రభావిత జిల్లాల జనసేన నాయకుల నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. రైతాంగం కడగండ్లను నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి రైతులతో స్వయంగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ