జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం, 9 గంటల వరకు 3.10 % పోలింగ్‌

GHMC Elections Polling: Up to 9 AM 3.10 Percent Polling Reported

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. నగరంలోని 150 డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఇక కరోనా బాధితులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పోలింగ్ నిర్వహణలో 48 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ఉదయం నుంచే ప్రజలు, పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా ఉదయం 9 గంటల వరకు 3.10 % పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో 74,44,260 మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మరోవైపు ఈ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నుంచి 150 అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్ పార్టీ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 76, ఇండిపెండెంట్ గా 415 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 150 డివిజన్లకు గానూ అన్ని పార్టీల నుంచి 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ