దేశవ్యాప్తంగా రేపే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

COVID-19, Covid-19 Vaccination Drive Rollout, Covid-19 Vaccination Rollout, Mango News, Narendra Modi to Launch Rollout of Covid-19 Vaccination, pm narendra modi, Rollout of Covid-19 Vaccination, Rollout of Covid-19 Vaccination Drive, Rollout of Covid-19 Vaccination Drive on Jan 16

దేశవ్యాప్తంగా రేపు (జనవరి 16, శనివారం) కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. భార‌త‌దేశం అంత‌టా కరోనా వాక్సిన్ వేసే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ప్రారంభించ‌నున్నారు. ఈ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో ప్రారంభం కానుంది. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత‌ ప్రాంతాల‌లో కలిపి మొత్తం 3006 కేంద్రాల‌లో వాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభమవుతుండగా, ఒక్కో కేంద్రంలో ప్రారంభోత్స‌వ రోజున సుమారు 100 మంది ల‌బ్ధిదారుల‌కు వాక్సిన్ వేయ‌నున్నారు. దీంతో తొలి రోజున 3 లక్షల మందికి వ్యాక్సిన్ అందనుంది. ముందుగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగంలోని ఐసిడిసి వ‌ర్క‌ర్లతో స‌హా హెల్త్‌కేర్‌ వ‌ర్క‌ర్ల‌కు వ్యాక్సిన్ వేయనున్నారు.

కో-విన్ యాప్ ద్వారా ఈ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ కో-విన్ ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాంను రూపొందించింది. ఇది వాక్సినేష‌న్ స్టాక్‌లు, నిల్వ టెంప‌రేచ‌ర్‌, కరోనా వాక్సిన్ కు సంబంధించి వ్య‌క్తిగ‌త ల‌బ్ధిదారులకు సంబంధించిన స‌మాచారాన్ని రియ‌ల్‌టైమ్‌లో అందించనుంది. కో-విన్ యాప్ డిజిట‌ల్ ప్లాట్‌ఫారం వాక్సినేష‌న్ ప్రక్రియకు సంబంధించి అన్నిస్థాయిల‌లో ప్రోగ్రామ్‌ మేనేజ‌ర్ల‌కు సహకరించనుంది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి 24 గంట‌లూ ప‌నిచేసే 1075 కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ద్వారా కరోనా మ‌హ‌మ్మారికి సంబంధించి వివరాలు, వాక్సిన్ కార్య‌క్ర‌మం, కో-విన్ సాఫ్ట్‌వేర్ కు చెందిన సందేహాల‌కు సమాధానాలు ఇవ్వనున్నారు. కోవిషీల్డ్‌, కోవాక్సిన్ డోసులను దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేయగా, అక్కడి నుంచి జిల్లాలకు కూడా చేరవేయబడ్డాయి. వ్యాక్సిన్ రవాణా పూర్తవడంతో పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ