రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు సహా పలు పథకాలను ప్రజలకు ఇంటివద్దనే అందిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లకు సత్కారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోరంకిలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ సేవలు అందించిన గ్రామా/వార్డు వాలంటీర్లకు 3 కేటగిరీల కింద సీఎం వైఎస్ జగన్ పురస్కారాలను అందజేశారు.
నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వాలంటీర్ల అందరికి సెల్యూట్: సీఎం జగన్
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం చూడకుండా, పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా, వివక్ష, పక్షపాతం చూపకుండా వాలంటీర్లు నిస్వార్ధంగా పనిచేస్తున్నారని చెప్పారు. గొప్ప సేవలు అందిస్తున్న గ్రామా/వార్డు వాలంటీర్లందరికీ సీఎం అభినందనలు తెలిపారు. మంచి చేయడానికి తాపత్రయపడుతూ వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు అందించిన సేవల్లో కొన్నింటిని సీఎం ప్రజలకు వివరించారు. వాలంటీర్ల మీద కూడా ప్రతిపక్షాల నుంచి అవాకులు చూస్తుంటామని, అయితే ఎప్పుడైనా మీ జీవితాల్లో క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు కూడా వెరవవద్దని వాలంటీర్లకు సూచించారు. ధర్మాన్ని నిర్వర్తించండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని చెప్పారు.
సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర కేటగిరీల కింద మొత్తం 2,22,525 మంది వాలంటీర్లను సత్కారం చేయబోతున్నామని చెప్పారు. సత్కారంతో పాటుగా సేవామిత్ర పురస్కారం కింద రూ.10 వేల నగదు బహుమతి, సేవారత్న పురస్కారం కింద రూ.20 వేల చొప్పున నగదు బహుమతి, సేవా వజ్రం పురస్కారం కింద రూ.30 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నామని, ఈ పురస్కారాలకు ప్రభుత్వం 240 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. వాలంటీర్లకు ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం అందిస్తామన్నారు. నిస్వార్ధంగా సేవలు చేస్తున్న వాలంటీర్ల అందరికి సెల్యూట్ చేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ