రాష్ట్రంలో కరోనా చికిత్సలో భాగంగా బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధిక ఫీజులు వసూలు చేయడంపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా శుక్రవారం నాడు హైదరాబాద్ లోని 5 ఆసుపత్రుల అనుమతులను రద్దు చేయగా, శనివారం నాడు కూడా మరో 5 ఆసుపత్రుల కరోనా చికిత్స అనుమతులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రద్దు చేసింది.
అమీర్‌పేట్ లోని ఇమేజ్ ఆసుపత్రి, ఎల్‌బీ నగర్‌లోని అంకుర ఆసుపత్రి, కొండాపూర్‌లోని సియాలైఫ్ ఆసుపత్రి, సంగారెడ్డి జిల్లా, షాపూర్‌నగర్‌లోని సాయి సిద్ధార్థ ఆసుపత్రి, మహబూబాబ్ నగర్, భూత్‌పూర్‌లోని పంచవటి ఆసుపత్రుల అనుమతులను రద్దు చేశారు. శుక్రవారం నాడు బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రి, బేగంపేటలోని విన్ ఆసుపత్రి, కాచిగూడలోని టీఎక్స్ ఆసుపత్రి, కేపీహెచ్‌బీలోని మ్యాక్స్ హెల్త్ ఆసుపత్రి మరియు మోతీనగర్‌లోని నీలిమ ఆసుపత్రుల కరోనా చికిత్స అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికి ప్రభుత్వం మొత్తం 10 ఆసుపత్రుల అనుమతులను రద్దు చేసినట్లు అయింది. మరోవైపు కరోనా చికిత్సకు అధిక ఫీజుల వసూళ్లపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు శనివారం నాటికి మొత్తం 79 ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ