తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రిలో 150 బెడ్స్ ఐసీయూను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును హైసియా మరియు సహా సభ్య సంస్థలైన మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో స్పాన్సర్ చేశాయి. ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించిన అనంతరం టిమ్స్ లోని కరోనా వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికీ అందుతున్న వైద్య సేవల తీరును కూడా మంత్రి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రూ.15 కోట్లు వెచ్చించి టిమ్స్ లో హైసియా ద్వారా 150 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినందుకు 5 సాఫ్ట్ వేర్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలు సమకూర్చడంతో పాటుగా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత లాక్‌డౌన్ ముగిసేలోగా మొత్తానికి పోకపోయినా, రెండో దశ తీవ్రత తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణుల నివేదిక ద్వారా తెలుస్తుందన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో ఏడాది కాలంగా వేలాది మంది బాధితులకు చికిత్స అందజేశామన్నారు. మొదటి వేవ్ సమయంలో కూడా ముఖ్యంగా ఐటీ కంపెనీలు దాదాపు రూ.80 కోట్లతో వివిధ వైద్య పరికరాలు అందించి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించారని, రెండో వేవ్ లో కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి పలువిధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఈ కరోనా పరిస్థితుల్లో ఎంతో సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ