శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీలో నిర్వహించిన కీలకమైన బలపరీక్షలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా, మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. బలపరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వానికి 169 ఓట్లు వచ్చాయి. ముందుగా గవర్నర్ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ శనివారం నాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన అనంతరం సీఎం ఉద్ధవ్ థాకరే తన కేబినెట్ మంత్రులను సభకు పరిచయం చేశారు.
అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ ప్రొటెం స్పీకర్ను మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. స్పీకర్ ను ఎన్నుకోకుండా విశ్వాస పరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. ఈ వాదనపై స్పీకర్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశ్వాస పరీక్ష నిర్వహిస్తున్నామని, తనను గవర్నరే నియమించారని తెలిపారు. విశ్వాస పరీక్ష సమయంలో ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే పాటిల్ హెడ్కౌంట్కు ఆదేశించగా, ప్రతిపక్ష బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి అనుకూలంగా మొత్తం 169 ఓట్లు వచ్చాయని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. బలపరీక్షలో నెగ్గడంతో మహా వికాస్ అఘాడీ (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ )కూటమి సంకీర్ణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువు తీరినట్టయింది.
[subscribe]