విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారం రోజులలోపు స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపబోతున్నారో స్పష్టమైన ప్రకటన చేసి అఖిల పక్షం ద్వారా సమస్య తీవ్రతను కేంద్రానికి తెలియచేయాలన్నారు. ఈ మేరకు ఆదివారం నాడు స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ-నిర్వాసితుల ఐక్య వేదికల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా విశాఖ విమానాశ్రయం నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ వేలమందితో సాగిన ర్యాలీతో పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
స్పందించని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం:
అనంతరం వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి వైసీపీ నాయకులకు పిలుపు ఇస్తున్నాను. మీరు అఖిలపక్షాన్ని పిలవాలి. వారం రోజుల లోపు ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంటులో మాట్లాడుతాం. అవసరం అయితే కేంద్రం మీద పోరాడి ఒప్పించుకోవాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు సాధించుకుంటామని చెప్పండి. అలా కాకుండా కల్లబొల్లి కబుర్లు చెబితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఈ అంశాన్ని మీరు ముందుకు తీసుకువెళ్లపోతే మాత్రం రాబోయే రెండేళ్లు మీకు గడ్డు కాలం తప్పదు. మీ వద్ద 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేన ఎమ్మెల్యేతో కలిపి.22 మంది ఎంపీలు ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీని కూడా కలుపుకుంటే 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు కలసి ఒక కార్యచరణ ప్రకటించండి. మేము అండగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలసి నడుద్దాం. విశాఖ ఉక్కును కాపాడుకుందాం. దీనిని సీరియస్ గా తీసుకోని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేస్తున్న పెద్దలు ఒక కార్యాచరణ ప్రకటించండి. ప్రతి జిల్లా ప్రజల ముందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు ఎంత ముఖ్యమో తీసుకువెళ్లండి. వైసీపీ ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకువద్దాం అనే అంశం మీద చర్చించండి” అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు:
“విశాఖ ఉక్కు సాధన చరిత్ర నేటి తరానికి తెలియాలి ఉక్కు కర్మాగారం దేశ ఆర్ధిక అభివృద్ధికీ, మౌలిక వసతుల కల్పనకు అవసరం. ఉక్కు లేకపోతే దేశం ముందుకు వెళ్లదు. ఒకసారి విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం మీరు చూసిన కష్టాలను, అసలు పరిశ్రమ ఎలా ప్రారంభం అయ్యిందన్న విషయాలు ఉద్యమానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన నేటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని రేపే నినాదం. కులాల కుంపట్లు, వర్గాల పోరుతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అన్నింటికీ అతీతంగా ఆ ఒకే ఒక్క నినాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. అదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 1963లో నాటి గనులశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం భారత దేశానికి ఉక్కు కర్మాగారం అవసరం ఉంది. సముద్ర తీరాన్న దాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్లిన తర్వాత ఆంధ్రులంతా ఆనందించారు. రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఎదగబోతోంది అని. మొదట మాటిచ్చి తర్వాత ఇక్కడ కాదు అని కేంద్రం మాట మార్చినప్పుడు నాడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న అమృతరావు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వ విద్యాలయం విద్యార్ధులు అండగా నిలబడ్డారు. ఉద్యమం ఉగ్రరూపం దాల్చడం, తీవ్ర స్థాయికి వెళ్లడం, రైల్ రోకోలు, పోలీసుకాల్పుల నడుమ 32 మంది యువకులు చనిపోయారు. పీలేరు నుంచి పలాస వరకు, విశాఖ నుంచి వరంగల్ వరకు 32 బలిదానాలయ్యాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. 1971లో శంకుస్థాపన జరుపుకుంది. 1992లో దాదాపు 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వచ్చాక నాటి ప్రధాని పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారు. రెండు దశాబ్దాల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.6000 కోట్ల లాభాన్ని చూసింది. రూ.40 వేల కోట్లు కేంద్ర, రాష్ట్రాలకు టాక్సులు కట్టింది. 16 వేల మందికి శాశ్వత కార్మికులకు, 18 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి ఇచ్చింది. పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం 22 వేల ఎకరాలు, మనుషులు జీవిస్తున్న 64 గ్రామాలను ఖాళీ చేయించారు. ఈ రోజుకీ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకు పరిహారం అందలేదు. వారి కుటుంబాల దీనస్థితిని చూస్తే బాధ కలుగుతుంది. ఒక్కోసారి తినడానికి తిండి లేక దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలతో కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడేమో ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంది ప్రైవేటీకరించబోతున్నాం అని ప్రకటించారు. ఆ వార్త అందరితో పాటు నాకు బాధ కలిగించింది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ