ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

Noted Tollywood Lyricist Sirivennela Seetharama Sastry Passed Away

ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం మధ్యాహ్నం 4.07 గంటలకు కన్నుమూశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24 న సికింద్రాబాద్‏ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచే ఆయనకు ఐసీయూలో ఏక్మో సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నారు. నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచినట్టు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మే 20, 1955లో విశాఖపట్నం జిల్లాలో జన్మించారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1986లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమా పాటలతో ఆయన ఎనలేని ఖ్యాతి గడించారు. ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది. దాదాపు 800 సినిమాల్లో 3వేలకుపైగా అద్భుతమైన పాటలతో సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. ఆయన సినీ కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. సినీరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీతారామశాస్త్రి మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =