తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నగదు పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోరోజు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ఆరోరోజు మొత్తం 1.91 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.512.26 కోట్లు జమచేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 59,51,428 మంది రైతులకు రూ.5806.35 కోట్ల రైతుబంధు నిధులు పంపిణీ జరిగిందని మంత్రి తెలిపారు. సమైక్య పాలనలో దండగన్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ చేశారన్నారు. వ్యవసాయాన్ని వదిలి ఇతర రంగాలలో ఉపాధి వెతుక్కున్న రైతాంగాన్ని తిరిగి వ్యవసాయ రంగం వైపు మరలించారని చెప్పారు.
“జనాభాలో 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలోని 63 లక్షల కుటుంబాలకు ఈ విడత రైతుబంధు సాయం అందుతున్నది. మొత్తం రాష్ట్ర జనాభాలో 2.50 కోట్ల జనాభా ప్రత్యక్ష్యంగా లబ్దిపొందుతున్నది. వ్యవసాయరంగం బలోపేతంతో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయింది ఇది సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించి ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుభీమా, సాగునీటి పథకాలు, వ్యవసాయానికి ఉచిత కరంటు సరఫరా పథకాలకు ఎలాంటి ఆటంకాలు రానివ్వలేదు. వ్యవసాయ సంక్షోభానికి రైతుబంధు పథకం దారి, తెన్నూ చూపింది” అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ