ముచ్చింతల్ లో శ్రీ రామానుజాచార్య స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి సమారోహ ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గత 12 రోజులుగా భక్త జనాన్ని భక్తి పారవశ్యంలో ముంచుతున్న ఈ అద్భుత కార్యక్రమానికి రేపటితో ముగింపు పలకనున్నారు. నేడు ఈ వేడుకలలో పాల్గొనటానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. నేటి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌ శ్రీరామనగరానికి చేరుకున్నారు. సతీసమేతంగా ఆశ్రమానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ఎదురేగి స్వాగతం పలికారు. ఆ తర్వాత సమతామూర్తి కేంద్రంలోని మొదటి అంతస్తు భద్రవేదిలో.. 120 కేజీల శ్రీ రామానుజాచార్యుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో.. యాగశాలలోని 108 దివ్య దేశాలను సందర్శించుకున్నారు. తదుపరి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. అనంతరం ఆశ్రమంలో ఏర్పాటుచేసిన 216 అడుగుల ‘సమతామూర్తి’ విగ్రహాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామి.. ఆశ్రమంలోని విశేషాలను దగ్గరుండి రాష్ట్రపతికి వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ