ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే న్యూఢిల్లీలోని ఏపీ భవన్ తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విద్యార్థులను తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర అధికారులతో కూడిన ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీకి చైర్ పర్సన్ గా రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు వ్యవహరించనుండగా, గితేష్‌శర్మ ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) కన్వీనర్ గా ఉండనున్నారు. అలాగే ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఎండీ డా.ఎ.బాబు, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్, రైతు బజార్ సీఈవో బి.శ్రీనివాస రావు, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ సీఈవో దినేష్‌కుమార్, అన్ని జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వెలగపూడిలోని ఆర్టీజీఎస్‌లోప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తూ, ఏపీ విద్యార్థులతో ఈ కమిటీ సంప్రదించనుంది.
ఉక్రెయిన్ లో ఏపీ విద్యార్థులు మరియు నివాసితులను గుర్తించడం మరియు ఉక్రెయిన్ నుండి వారిని దేశానికి సురక్షితంగా చేరేలా చేయడంలో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక పాత్ర వహించనుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సక్రమంగా సమన్వయం చేసుకుని, ఉక్రెయిన్ భూ సరిహద్దుల్లోని హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ లలో మోహరించిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బృందాలతో కలిసి పనిచేయాలని ఈ కమిటీకి సూచించారు. అలాగే ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడానికి జిల్లా కలెక్టరేట్ లలో సెల్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారు నేరుగా స్టేట్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని మరియు కేస్ టూ కేస్ ఆధారంగా అనుసరించాలని చెప్పారు. ఇక మండల రెవెన్యూ అధికారులు ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చే ఆంధ్రప్రదేశ్ నివాసితులందరితో సంప్రదింపులతో ఉండనున్నారు. ఢిల్లీలోని అన్ని మంత్రిత్వ శాఖలతో, ప్రత్యేకించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ పిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ కు సూచించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ కార్యదర్శి డా.సమీర్ శర్మ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల్లో 22 మంది శనివారం నాడు దేశానికి చేరుకోనున్నట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీ పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ