ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మీడియా ప్రతినిధులపై దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులకు బెయిల్ మంజూరైంది. మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీవీఎస్‌వీ లక్ష్మి ఆరుగురు రైతులకు ఒక్కొక్కరికి 10 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ముందుగా డిసెంబర్ 27న అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను కవర్ చేసేందుకు వెళ్లిన కొంతమంది మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆరుగురు రైతులను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి మంగళిగి కోర్టులో ప్రవేశపెట్టారు. రైతులపై పోలీసులు పెట్టిన హత్యాయత్నం సెక్షన్లుపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనంతం పోలీసులు కేసు సెక్షన్లను 373గా మార్చారు. ఆతర్వాత వారిని రిమాండ్ మీద గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
దాడి కేసులో అరెస్టయిన ఆరుగురు రైతులను సోమవారం నాడు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌లో వారిని కలుసుకుని ధైర్యం చెప్పారు. రైతులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రైతుల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు. రైతులపై ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. న్యాయపోరాటం చేస్తున్న రైతులను ఇబ్బందిపెట్టడానికే అధికార పార్టీ నేతలు కుట్ర పన్నారని విమర్శించారు. ముఖ్యంగా పోలీసులు రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, చట్టాల ఉల్లంఘనకు పాల్పడటం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
[subscribe]