తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో.. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుంచి కొంచెం నీరసంగా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌కు ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో.. తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో నేడు జరుగుతున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ వెళ్ళటం లేదని అధికారులు వెల్లడించారు. అయితే, యాదాద్రిలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారని రెండు రోజుల క్రితం యాదాద్రి దేవస్థానం ఈవో గీత తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ