ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు తమ శకటాలతో ఈ పరేడ్ లో పాల్గొననున్నాయి.
మహారాష్ట్ర శకటాలను అనుమతి లభించకపోవడంతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మహారాష్ట్ర పట్ల కేంద్రం పక్షపాత వైఖరిని చూపిస్తుందని, శకటానికి అనుమతి ఇవ్వకపోవడంపై మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ నేత సుప్రియా సూలే డిమాండ్ చేశారు. ఈ వేడుకలలో దేశంలోని అన్ని రాష్ట్రాలకూ కేంద్ర ప్రభుత్వం ప్రాతినిథ్యం ఇవ్వాలని అన్నారు. అలాగే మహారాష్ట్ర శకటాన్ని తిరస్కరించడం రాష్ట్రానికి అవమానకరమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తమ రాష్ట్రాలకు చెందిన శకటాలను తిరస్కరించడంపై ఇతర రాష్ట్రాల నాయకులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]